sharad pawar: కేసీఆర్ కూటమికి పవార్ మోకాలడ్డు.. 27న బీజేపీ యేతర పక్షాలతో సమావేశం!

  • కాంగ్రెస్‌కు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్న శరద్ పవార్
  • కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాలను దగ్గర చేయాలన్న ఆలోచన మరాఠా నేత
  • కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు మమత రెడీ
  • కేసీఆర్‌తో భేటీని సీరియస్‌గా తీసుకోని ‘దీదీ’

బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన మూడో ఫ్రంట్ ప్రతిపాదనకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మోకాలడ్డుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు మరోవైపు కాంగ్రెస్‌తో ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా లేవు. ఇటీవల ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన టీడీపీ కూడా కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు వెనకడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 27న శరద్ పవార్ ఢిల్లీలో బీజేపీ యేతర పక్షాలతో సమావేశం నిర్వహించనున్నారు.

ఫలితంగా తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ వంటి పార్టీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య విభేదాలు తలెత్తడంతో శివసేన బయటకు వచ్చింది. దీంతో బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉంటామని శరద్ పవార్ సంకేతాలు ఇచ్చారు. అయితే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన పాత మిత్రుడైన కాంగ్రెస్‌కు చేరువయ్యేందుకు తాజాగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు.

అందులో భాగంగానే ఈనెల 27న సమావేశం ఏర్పాటు చేసి పలు పార్టీలను ఆయన స్వయంగా ఆహ్వానిస్తున్నారు. మంగళవారం లక్నో వెళ్లిన శరద్ పవార్ ఎస్పీ అధినేత అఖిలేష్‌ను కలిసి ఆహ్వానించారు. ప్రత్యేక దూత ద్వారా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆహ్వానం పంపారు. పవార్ ఆహ్వానానికి ఆమె సానుకూలంగా స్పందించారు.

ఇక 26 నుంచి నాలుగు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్న మమత యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నారని ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, రాజ్యసభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి అయిదో స్థానంలో నిలబెడుతున్న తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సీపీఎం మద్దతుకు బదులుగా తృణమూల్ కాంగ్రెస్ మద్దతును కాంగ్రెస్ స్వీకరించడం ఈ వార్తలకు మరింత బలం ఇస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలోనే మొన్నటి కేసీఆర్‌తో భేటీని ‘దీదీ’ అంత సీరియస్‌గా తీసుకోలేదని చెబుతున్నారు. ఆ భేటీని కేవలం ‘ఫలవంతం’గానే మమత పేర్కొన్నారని అంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయనున్న కూటమికి కాంగ్రెస్‌ను దూరంగా పెట్టవద్దని కేసీఆర్‌తో మమత చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తొందరపడవద్దని సూచించినట్టు సమాచారం. శరద్ పవార్ ఇంట జరిగే సమావేశానికి బీజేపీ యేతర పార్టీలు ఎన్ని హాజరవుతాయనే దానిపైనే ఇప్పుడు చర్చంతా జరుగుతోంది. ఎక్కువ పార్టీలు కనుక ఈ సమావేశానికి హాజరైతే కేసీఆర్ ప్రతిపాదిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ యేతర మూడో కూటమికి అడ్డుకట్ట పడినట్టేనని ఢిల్లీ సమాచారం.

  • Loading...

More Telugu News