shakob al hasan: అద్దం పగులగొట్టింది సాక్షాత్తూ బంగ్లాదేశ్ కెప్టెనా?
- చివరి లీగ్ సందర్భంగా చోటుచేసుకున్న వివాదం
- విసురుగా డ్రెస్సింగ్ రూం డోర్ వేసిన కెప్టెన్ షకిబ్ అల్ హసన్
- వేగానికి పగిలిన డ్రెస్సింగ్ రూం గ్లాస్
శ్రీలంకలో జరిగిన నిదహస్ ముక్కోణపు టీ20 సిరీస్ చివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న వివాదంతో బంగ్లా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూం అద్దాలు పగులగొట్టారంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలు సీసీటీవీ కెమెరాల్లో కూడా నమోదు కాలేదు. దీంతో దీనిపై విచారణ చేపట్టిన మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్, బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఆహార పదార్థాలు సరఫరా చేసే సిబ్బందిని విచారించారు.
దీంతో వారు అద్దం పగలడానికి కారణం బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ అని తెలిపారు. అయితే, ఆయన నేరుగా అద్దం పగలగొట్టలేదని, డ్రెస్సింగ్ రూంలోకి వస్తూ, దానిని విసురుగా మూసేశాడని, దీంతోనే అది భళ్లున పగిలిపోయిందని తెలిపారు. దీంతో అద్దం పగలడానికి కారణం షకిబల్ హసన్ అని స్పష్టమైంది. అయితే దీనికి వీడియో సాక్ష్యం లేకపోవడంతో ఆయనపై చర్యలు చేపట్టలేకపోయినట్టు తెలుస్తోంది. దీనిపై విచారం వ్యక్తం చేసిన బంగ్లాబోర్డు, అందుకు నష్టాన్ని భరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.