Atul Johri: టీచర్లపై లైంగిక వేధింపులు.. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్.. విడుదల
- ఎనిమందిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్
- అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
- జైల్లో పెట్టవద్దంటూ మొర.. బెయిలు మంజూరు
టీచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అతుల్ జోహ్రీ బెయిలుపై విడుదలయ్యారు. జోహ్రీ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఎనిమిది మంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరంతా స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు జోహ్రీకి వ్యతిరేకంగా క్యాంపస్‌లో ఆందోళన చేపట్టాయి.
జోహ్రీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు 14 రోజుల కస్టడీని కోరారు. అయితే, తనను జైలుకు పంపితే తన కెరీర్ నాశనమైపోతుందని, కాబట్టి బెయిలు మంజూరు చేయాలని పాటియాలా హౌస్ కోర్టును జోహ్రీ అభ్యర్థించారు. దీంతో స్పందించిన కోర్టు జోహ్రీకి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. కాగా, తనపై ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో ఈనెల 16న జోహ్రీ అడ్మినిస్ట్రేటివ్ విధులకు రాజీనామా చేశారు.