Chandrababu: పార్టీ ఎంపీలతో బాబు టెలీకాన్ఫరెన్స్...న్యాయం జరిగే వరకు పోరాడాలని సూచన
- చివరి వరకు ఇదే స్ఫూర్తితో పోరాడాలని పార్టీ ఎంపీలకు బాబు సూచన
- తిరుపతిలో ఉన్నా పార్లమెంటులో పరిస్థితులపై ఆరా
- కేంద్రంలోని అధికార పార్టీ పెద్దలు మాట తప్పారని ధ్వజం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ రోజు ఉదయం తమ పార్టీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు జాతీయ స్థాయి అంశంగా మారాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలో ఉన్నప్పటికీ పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. తాము ప్రజల కోసం పోరాడుతున్నామని, న్యాయం కోసం పోరాడుతున్నామని, మన హక్కుల కోసం పోరాడుతున్నామని ఎంపీలకు ఆయన తెలిపారు.
చివరి వరకు ఇదే స్ఫూర్తితో పోరాడాలని వారికి ఆయన సూచించారు. రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తమకు ఎవరి మీదా ద్వేషం గానీ, కోపం గానీ లేవని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలోని అధికార పార్టీ పెద్దలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు ఏపీ పట్ల సానుభూతిని తెలుపుతూ మద్దతిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.