adari kishore: ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసినందుకు... అడారి కిషోర్ పై వేటు వేసిన బీజేపీ!
- విభజన హామీలను నెరవేర్చాలంటూ అడారి కిషోర్ డిమాండ్
- వేటు వేసిన విశాఖ నగర పార్టీ అధ్యక్షుడు
- నన్ను సస్పెండ్ చేసే అధికారం నగర అధ్యక్షుడికి లేదన్న యువనేత
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, విశాఖకు రైల్వే జోన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు బీజేవైఎం జాతీయ కమిటీ సభ్యుడు, యువనేత అడారి కిషోర్ పై వేటు పడింది. కిషోర్ ను సస్పెండ్ చేస్తున్నట్టు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టారు. ఈ వేటుపై కిషోర్ మండిపడ్డారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అధికారం నగర అధ్యక్షుడికి లేదని చెప్పారు. తాను బీజేవైఎం జాతీయ కమిటీలో ఉన్నానని... తనను సస్పెండ్ చేసేంత అధికారం ఇక్కడి అధ్యక్షుడికి లేదని తెలిపారు.
తాను బీజేపీని సపోర్ట్ చేస్తూనే మాట్లాడానని చెప్పారు. పార్టీ సస్పెన్షన్ గురించి తాను ఆలోచించనని... ప్రజల గొంతుకను వినిపించడమే తనకు ముఖ్యమని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఉమ్మడి రాష్ట్రం కోసం జేఏసీ తరపున కిషోర్ పోరాడారు. ఇప్పుడు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరంలతో పాటు విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.