Rahul Gandhi: పంచెకట్టుతో రాహుల్ గాంధీ ఆలయ దర్శనం
- సంప్రదాయక పంచె కట్టులో చిక్మగళూరులోని శృంగేరి శారదాంబ ఆలయ దర్శనం
- శృంగేరి మఠంలో వేద పాఠశాల విద్యార్థులతో ముచ్చట్లు
- తర్వాత చిక్ మగళూరు, హాసన్లలో బహిరంగ సభల్లో ప్రసంగం
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కర్ణాటకలో చేపట్టిన తన 'జనాశీర్వాద్ యాత్ర'లో భాగంగా ఈ రోజు చిక్ మగళూరులోని శృంగేరి శారదాంబ ఆలయాన్ని దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా పంచెకట్టులో ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శృంగేరి మఠాన్ని దర్శించారు. అక్కడ వేద పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.
షెడ్యూల్ ప్రకారం, ఈ రోజు చిక్ మగళూరు, హాసన్లలో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. రాహుల్ వెంట కర్ణాటక కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కేసీ వేణుగోపాల్, సీఎం సిద్ధరామయ్య, హోం మంత్రి జి.పరమేశ్వర్ తదితరులు ఉన్నారు. కాగా, యాత్రలో భాగంగా నిన్న ఉడుపిలోని తెంకా యర్మల్లో ఉన్న జాలర్లను ఆయన కలిశారు. అంతేకాక కొప్పాల్ జిల్లాలోని ప్రసిద్ధ హుళిగెమ్మ ఆలయాన్ని, యాదగిరి జిల్లాలోని గావి సిద్ధేశ్వర్ మఠాన్ని, గుల్బర్గాలోని ఖ్వాజా బాందే నవాజ్ దర్గాని, బీదర్ జిల్లాలోని బసవకల్యాణలో ఉన్న అనుభవ మంటపాన్ని ఆయన దర్శించిన సంగతి తెలిసిందే.