Chandrababu: రేపటి జాతీయ రహదారుల దిగ్బంధంపై స్పందించిన సీఎం చంద్ర‌బాబు

  • ఏ పోరాటమైనా చేయండి సహకరిస్తాం
  • శాంతి భద్రతలకు మాత్రం భంగం కలిగించవద్దు
  • కేంద్ర ప్రభుత్వం సాయం చేసేవరకు మా పోరాటం ఆగదు

రేపు జాతీయ రహదారుల దిగ్బంధానికి ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు పిలుపునిచ్చిన విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. 'రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పోరాటమైనా చేయండి సహకరిస్తాం.. కానీ, శాంతి భద్రతలకు మాత్రం భంగం కలిగించవద్దు' అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం మనకు సాయం చేసేవరకు ఆందోళన ఆగదని అన్నారు.

 ఈ రోజు అమరావతిలోని ఉండవల్లిలో 'మహిళా సాధికార మిత్ర'లతో ముఖాముఖిలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏపీ అభివృద్ధిలో వెన‌క‌బ‌డిపోకూడ‌దని అన్నారు. ఏమైనా ఫర్వాలేదని, ఈ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు ప్ర‌యత్నాలు చేస్తాన‌ని అన్నారు. చిన్న పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో కొత్త రాష్ట్రాన్ని కూడా అదే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

కాగా, ఓ ప‌క్క వైసీపీ నేత‌లు ప్రధానమంత్రి మోదీని కలుస్తూ విశ్వాసం ఉందంటున్నారని, మ‌రోపక్క అవిశ్వాస తీర్మానం పెడుతున్నారని చంద్ర‌బాబు అన్నారు. ఏ1, ఏ2 ఆర్థిక నేరస్తులతో ప్రధానమంత్రి చర్చిస్తూ ఏం సందేశం ఇస్తున్నారని ప్ర‌శ్నించారు. అలాగే జ‌న‌సేన అధినేత‌ పవన్ కల్యాణ్ గుంటూరులో మీటింగు పెట్టి మనల్నే విమర్శించారని, కానీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించ లేదని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News