pattiseema: పట్టిసీమలో రూ. 371 కోట్ల అవినీతి.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి: విష్ణుకుమార్ రాజు డిమాండ్
- పట్టిసీమ ప్రాజెక్టు చాలా గొప్పది
- చంద్రబాబును అభినందిస్తున్నాం
- కానీ, జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం
ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ఏపీ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు తెలిపారు. డబ్బుల్లేకుండా ఒక్క లారీ ఇసుక కూడా కొనే పరిస్థితి లేదని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు చాలా గొప్పదని... అలాంటి ప్రాజెక్టును తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా కూడా ఎంతో కష్టపడ్డారని కితాబిచ్చారు.
అయితే, ఈ ప్రాజెక్టులో రూ. 371 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవినీతి జరగలేదని టీడీపీ నేతలు చెబుతున్నారని... అలాంటప్పుడు విచారణ జరిపించడానికి సమస్య ఏంటని ప్రశ్నించారు. అవినీతిపై ఇంతకు ముందు ఎందుకు మాట్లాడలేదని తమను ప్రశ్నిస్తున్నారని... తనేమీ సీబీఐని కాదని, తమకు అందిన రిపోర్టుల మేరకే తాము మాట్లాడుతున్నామని చెప్పారు. తానేదో జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నట్టు కామెంట్ చేస్తున్నారని అన్నారు.