vishnu kumar reddy: బీజేపీకి కొత్త అర్థం చెప్పిన అచ్చెన్నాయుడు
- బీ అంటే భారతీయ జనతా పార్టీ
- జే అంటే జగన్మోహన్ రెడ్డి
- పీ అంటే పవన్ కల్యాణ్
ఏపీ అసెంబ్లీలో పట్టిసీమ ప్రాజెక్టుపై టీడీపీ, బీజేపీల మధ్య వాగ్యుద్ధం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని... సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... మొన్నటి దాకా మౌనంగా ఉండి... ఇప్పుడు ఉన్నట్టుండి సిట్టింగ్ జడ్జితో విచారణ, సీబీఐతో ఎంక్వైరీ అనే డిమాండ్లు చేస్తున్నారంటే... మీ మైండ్ లో ఎలాంటి కుట్ర ఉందో స్పష్టంగా అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
ఓ ప్లాన్ ప్రకారం బీజేపీ ఈ పని చేస్తోందని అన్నారు. బీ అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్, పీ అంటే పవన్ కల్యాణ్ అంటూ బీజేపీకి కొత్త అర్థం చెప్పారు. ఈ బీ.జే.పీలు ప్లాన్ ప్రకారం ఒకరి తర్వాత మరొకరు రాష్ట్రాన్ని మరింత నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే బీజేపీ చేసిన పనికి రాష్ట్ర ప్రజలు ఏడుస్తున్నారని... ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి కాకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని ప్రస్తుతం బీజేపీ చేస్తోందని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో పుట్టిన పౌరులుగా ముందు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలని, ఆ తర్వాత రాజకీయాల గురించి ఆలోచించవచ్చని సూచించారు.