Facebook: 'ఫేస్‌బుక్' సీఈఓ జుకర్‌బర్గ్‌కి కేంద్ర మంత్రి రవిశంకర్ వార్నింగ్
- అనుచిత రీతిలో భారత ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తే ఊరుకునేది లేదు
- ఐటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని సామాజిక మాధ్యమాల వేదికలకు హెచ్చరిక
- భారతీయుల వ్యక్తిగత సమాచారం చోరీ చేసిినట్లు తెలిస్తే సమన్లు పంపుతామని ఫేస్‌బుక్ సీఈఓకి వార్నింగ్
అనుచిత రీతిలో భారతదేశ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయాలని చూస్తే సహించేది లేదని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సహా సామాజిక మాధ్యమాల వేదికలను కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్చరించారు. అవసరమనుకుంటే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో పత్రికా స్వేచ్ఛకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు తమ ప్రభుత్వం ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని ఆయన తెలిపారు. దాదాపు 20 కోట్ల మంది భారతీయులు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. అమెరికా తర్వాత ఫేస్‌బుక్‌కు అతిపెద్ద మార్కెట్‌గా భారత్ ఉందని మంత్రి చెప్పారు.
డేటా చోరీకి సంబంధించి ఏవైనా ఉల్లంఘనలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే ఐటీ చట్టం కింద తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ఫేస్‌బుక్ సహా సోషల్ మీడియాని సూటిగా హెచ్చరించారు. "మిస్టర్ మార్క్ జుకర్‌బర్గ్.. భారత ఐటీ శాఖ మంత్రిగా నేను చెబుతున్న మాటను మీరు గుర్తించుకోవడం మంచిది. భారత్‌లో ఫేస్‌బుక్ ఫ్రొఫైల్‌ని మేం స్వాగతిస్తాం. కానీ, భారతీయులకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని చోరీ చేస్తే మాత్రం సహించేది లేదు. ఐటీ చట్టం కింద మాకు కఠిన చర్యలు తీసుకునే వీలుంది. ఆ చట్టం కింద భారత్‌కు రప్పించడానికి మీకు సమన్లు జారీ చేయడం సహా పలు చర్యల్ని తీసుకుంటాం" అని ప్రసాద్ తీవ్ర హెచ్చరిక చేశారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు దాదాపు 5 కోట్ల మంది ఫేస్‍బుక్ ఖాతాల సమాచారం చిక్కిందన్న వార్తల నేపథ్యంలో మంత్రి ఈ మేరకు ఫేస్‌బుక్ సీఈఓను హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.