sabbam hari: టీడీపీని తొక్కెయ్యాలని మోదీ-షా ఫ్లాన్ వేశారు.. నా దగ్గర పక్కా సమాచారం ఉంది: మాజీ ఎంపీ సబ్బం హరి
- పవన్ రోజుకో మాట మాట్లాడుతూ గ్రాఫ్ తగ్గించుకున్నారు
- పార్లమెంటులో టీఆర్ఎస్ ఆందోళన సబబు కాదు
- మోదీ-షా కుట్రలో భాగంగానే ఏపీకి అన్యాయం
బీజేపీ ప్రణాళికలో భాగంగానే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ టీడీపీపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ పైనా విమర్శలు చేస్తున్నారని మాజీ ఎంపీ సబ్బం హరి పేర్కొన్నారు. ఓ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పవన్ వెనక ముమ్మాటికి బీజేపీ ఉందని కుండబద్దలు గొట్టారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదన్న మోదీ-షా ద్వయం కుట్ర వల్లే ఏపీకి ఇన్ని కష్టాలు వచ్చాయన్నారు.
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న చంద్రబాబుకు అండగా నిలవకుండా దాని వల్ల తామెలా ప్రయోజనం పొందాలనే అంశంపైనే మిగతా పార్టీలన్నీ దృష్టిసారించాయన్నారు. స్వప్రయోజనాల కోసం అర్రులు చాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీనే అడ్డుకుంటోందని, అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలతో ఆందోళన చేయిస్తోందని తేల్చి చెప్పారు. సాటి తెలుగువారికి అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ ఇలా చేయడం ఎంతమాత్రమూ సబబు కాదన్నారు. మోదీపై ఇది తొలి అవిశ్వాసమని, చర్చకు వస్తే అంతర్జాతీయంగా ఆయన పరువు పోతుందనే అడ్డుకుంటున్నారని అన్నారు.
మోదీపై అవిశ్వాసం పెడితే ఢిల్లీ వెళ్లి అందరి మద్దతు కూడగడతానని చెప్పిన పవన్ ఇప్పుడు రోజుకో రకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దీనివల్ల ఆయన గ్రాఫ్ దారుణంగా పడిపోయిందన్నారు. అవిశ్వాసానికి మద్దతు ఇస్తానన్న పవన్ ఇప్పుడు నాటకాలని అనడంతో ప్రజల్లో ఆయనపై నమ్మకం సన్నగిల్లిందన్నారు.
వైసీపీ-జనసేనలను ఉపయోగించుకుని టీడీపీని తొక్కేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదని సబ్బం హరి పేర్కొన్నారు. ఈ విషయంలో తన వద్ద పక్కా సమాచారం ఉందన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పని అయిపోయినట్టేనని, ఆ పార్టీతో ఎవరు కలిసినా మటాషేనని తేల్చి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు తప్ప ఇంకెవరూ గౌరవంగా మాట్లాడడం లేదని, అడ్డగోలుగా విరుచుకుపడుతున్నారని సబ్బం హరి పేర్కొన్నారు.