AIADMK: ఏపీకి మేమెందుకు సహకరించాలి?.. బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చబోం: అన్నాడీఎంకే
- బీజేపీ-అన్నాడీఎంకే బంధాన్ని బయట పెట్టిన ‘నమదు అమ్మ’
- ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమిళనాడుకు నష్టమట
- అవిశ్వాసానికి తామెందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్న
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకుంటున్న అన్నాడీఎంకే తమ వైఖరి ఏంటో చెప్పేసింది. బీజేపీతో తమకున్న బంధాన్ని బయటపెట్టేసింది. ఈ మేరకు అన్నాడీఎంకే అధికారిక పత్రిక ‘నమదు అమ్మ’లో తేల్చి చెప్పింది. ఏపీ ప్రయోజనాల కోసం తాము సహకరించాల్సిన అవసరం లేదని, బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదని కుండ బద్దలు గొట్టింది. తాము లోక్సభలో పోరాడుతున్నది తమ రాష్ట్ర ప్రయోజనాలకే తప్ప ఏ పార్టీకీ వ్యతిరేకంగా కాదని పేర్కొంది.
ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన టీడీపీ మోదీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తామెందుకు మద్దతివ్వాలని సూటిగా ప్రశ్నించింది. ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అది తమకు హానిగా మారుతుందని, జయలలిత కూడా ఇదే చెప్పేవారని పత్రిక పేర్కొంది. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అన్నాడీఎంకేను అడ్డుపెట్టుకుని బీజేపీ నాటకాలు ఆడుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణలకు ‘నమదు అమ్మ’ పత్రిక కథనం మరింత బలం చేకూరుస్తోంది.