Chandrababu: పోలవరాన్ని ఆపేస్తున్నారు... సీబీఐ విచారణకూ ఆదేశాలు రానున్నాయి: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- బీజేపీ, జనసేన, వైసీపీ కుమ్మక్కు
- తొలుత ఆరోపణలు చేయించి, ఆపై విచారణకు ఆదేశం
- తనకు తెలిసిపోయిందన్న చంద్రబాబు
బీజేపీ, జనసేన, వైసీపీ కుమ్మక్కై తెలుగుదేశం సర్కారుపై ముప్పేట దాడికి దిగుతున్నాయని చంద్రబాబునాయుడు ఆరోపించారు. టీడీపీ నేతలు కూడా అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రానికి న్యాయం చేయకపోగా, పవన్, జగన్ ను అడ్డుపెట్టుకుని బీజేపీ మనపైనే కుట్ర చేస్తోందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు చూస్తున్నారని తనకు తెలిసిందని, సీబీఐ ఎంక్వయిరీలంటూ వైసీపీ, జనసేనతో ఆరోపణలు చేయించి, విచారణకు ఆదేశించడం ద్వారా ప్రాజెక్టును ఆపాలన్నది బీజేపీ ఉద్దేశమని ఆరోపించారు.
నదుల అనుసంధానానికి కీలకమైన పట్టిసీమపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని గట్టిగా తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమేనని, ఏ ప్రాజెక్టును ఆపాలని చూసినా ఊరుకునేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకతతోనే పోలవరం నిర్మిస్తున్నామని, రాష్ట్రం నిర్మిస్తే మరింత వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని భావించిన మీదటే, నిర్మాణ బాధ్యతలను తాను నెత్తిన వేసుకున్నానని అన్నారు.