FACEBOOK: ఫేస్ బుక్ కు మరో చిక్కు... వివరణ కోరుతూ సమన్లు పంపిన జర్మనీ
- 3 కోట్ల జర్మనీ యూజర్ల సమాచారాన్ని కాపాడారా?
- దీనిపై వివరణ ఇవ్వాలన్న జర్మనీ న్యాయ మంత్రి
- చర్చలకు రావాలంటూ సమన్లలో ఆదేశం
యూజర్ల సమాచారాన్ని జాగ్రత్తగా కాపాడాల్సిన విషయంలో విఫలమైన ఫేస్ బుక్ కు చిక్కులు మొదలయ్యాయి. దీనిపై వివరణ ఇవ్వాలని, అవసరమైతే ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ కు సమన్లు పంపిస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు జర్మనీ కూడా ఇంతే తీవ్రంగా స్పందించింది. జర్మనీలోని 3 కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్ల సమాచారాన్ని అనధికారికంగా మూడో పక్షం వినియోగించకుండా రక్షణ చర్యలు చేపట్టిందీ, లేనిదీ తెలియజేయాలని జర్మనీ కోరింది.
జర్మనీ న్యాయ మంత్రి కటారినా బార్లే సమన్లు పంపారు. ఈ మేరకు జర్మనీ పత్రికలు ఈ రోజు కథనాలను ప్రచురించాయి. ‘‘జర్మనీకి చెందిన 3 కోట్ల మంది యూజర్ల డేటాకు ఏం జరిగింది? అన్నదే ప్రశ్న. వినియోగదారుల రక్షణకు సంబంధించి ఇది కీలకమైనది’’ అని బార్లే అన్నారు. జర్మనీ న్యాయ శాఖ కార్యాలయంలో చర్చలకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. యూజర్ల డేటా దుర్వినియోగం జరగకుండా నివారించేందుకు స్పష్టమైన నిబంధనలు అవసరమని, ఇది ప్రజాస్వామ్యానికే ముప్పు అని అభిప్రాయపడ్డారు.