indian army: భారతీయ సైన్యంలోనూ ఇక పోర్టర్లు... నెలసరి వేతనం రూ.18,000
- పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టి అదనపు భత్యాలు
- ఉచిత వైద్య వసతి, రేషన్ సదుపాయం
- మెరుగైన విధానానికి రక్షణ శాఖ ఆమోదం
పోర్టర్లు అంటే... ఎర్ర చొక్కా వేసుకుని రైల్వేలో లగేజీ, ఇతర సేవలను అందించే వారే కళ్లలో మెదులుతారు. ఇకపై భారతీయ ఆర్మీలోనూ ఈ తరహా పోర్టర్లు దర్శనమివ్వనున్నారు. పాకిస్తాన్, చైనా సరిహద్దుల వరకు రవాణా, సరుకుల చేరవేత సంబంధిత సేవల కోసం సివిల్ పోర్టర్లను నియమించుకునేందుకు ఉద్దేశించిన మెరుగైన విధానానికి రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.
వీరికి రూ.18,000 నెలసరి వేతనంగా చెల్లిస్తారు. అలాగే, వారు పనిచేస్తున్న ప్రాంతం, ప్రాణానికి ఉన్న ప్రమాదం ఇతర అంశాల ఆధారంగా అదనపు భత్యాలు కూడా ఇస్తారు. వైద్య వసతి, రేషన్ సదుపాయం కల్పిస్తారు. వాస్తవానికి సైన్యంలో పోర్టర్ల సేవలను ఇప్పుడు కూడా వినియోగించుకుంటున్నారు. కానీ, వారిని దినసరి కూలీలుగా తీసుకుంటున్నారు. వారికంటూ ఓ వ్యవస్థ, విధానం లేదు. దీంతో ఆ దిశగా ముందడుగు పడింది.