Chandrababu: అసెంబ్లీలో కోర్టు తీర్పును చదివి వినిపించిన చంద్రబాబు
- పట్టిసీమలో అవినీతి జరగలేదని కోర్టే చెప్పింది
- మళ్లీమళ్లీ అవే విమర్శలు ఎందుకు చేస్తున్నారు?
- వాస్తవాలను వక్రీకరించి మాట్లాడటం దుర్మార్గమైన చర్య
కోర్టులు కొట్టేసిన అంశాలపై కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పట్టిసీమపై గతంలోనే ఎన్నో కేసులు వేశారని, రకరకాల ఆరోపణలు చేశారని చెప్పారు. పట్టిసీమలో ఎలాంటి అవినీతి జరగలేదని కోర్టే చెప్పిందని... ఇప్పుడు మళ్లీ అలాంటి ఆరోపణలే చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పును కూడా ఆయన చదివి వినిపించారు. పట్టిసీమ నిర్మాణ సమయంలోనే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని... అయినప్పటికీ, తాము దాన్ని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ఈమేరకు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనుల వివరాలను ప్రతి వారం ఆన్ లైన్ లో ఉంచుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. లాభాల కోసం పని చేయడం లేదని పనులను చేపట్టిన నవయుగ సంస్థ ఇప్పటికే స్పష్టంగా చెప్పిందని అన్నారు. పెద్ద ప్రాజెక్టును పూర్తి చేస్తే సంస్థకు మంచి పేరు వస్తుందని నవయుగ చెప్పిందని తెలిపారు. ఇప్పటి వరకు 54 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. 16 ప్రాజెక్టుల ప్రగతిని చూసి మాట్లాడాలని తమను విమర్శిస్తున్నవారికి చెబుతున్నానని తెలిపారు. వాస్తవాలను వక్రీకరించి మాట్లాడటం దుర్మార్గమైన చర్య అని అన్నారు. పోలవరంకు మనం రూ. 12,600 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
పట్టిసీమ ప్రాజెక్టుకు లిమ్కా అవార్డు కూడా వచ్చిందని చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకు సకాలంలో నీటిని అందించామని చెప్పారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని సరఫరా చేయగలిగామని తెలిపారు.