Chandrababu: ఏపీలో ప్రయోగాత్మకంగా 'నైపుణ్య రథం' పరుగులు
- జెండా ఊపి ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు డిజిటల్ విద్య, యువతకు నైపుణ్య శిక్షణ
- మే నెలాఖరులోగా మరో 12 రథాలు
- వరల్డ్ ఆన్ వీల్ (వావ్) తో మారుమూల గ్రామాల్లో టెక్నాలజీ మరింత విస్తరణ
ఆంధ్రప్రదేశ్ నైపుణ్య రథం (వరల్డ్ ఆన్ వీల్...వావ్)తో మారుమూల గ్రామాల్లో టెక్నాలజీ మరింత విస్తరిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇదో సరికొత్త ప్రయోగానికి నాంది పలుకుతోందన్నారు. మే లోగా మరో 12 నైపుణ్య రథాలు రానున్నాయన్నారు. సచివాలయంలో ఒకటో నెంబర్ బ్లాక్ ఎదుట ఏపీ నైపుణ్య రథాన్ని(వరల్డ్ ఆన్ వీల్స్... వావ్) పచ్చజెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే పథకాల అమలులో ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ, సత్ఫలితాలు సాధిస్తోందన్నారు.
ఇంటర్నెట్ థింగ్స్ పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామన్నారు. ఫైబర్ గ్రిడ్ పేరుతో ప్రతి ఇంటికీ 500 ఛానళ్లతో పాటు ఇంటర్నెట్ తో కూడిన కేబుల్ కనెక్షన్ ను రూ.149లకే ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2 లక్షల ఇళ్లకు ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు అందజేశామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి కోటీ 50 లక్షల ఇళ్లకు ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏపీ నైపుణ్య రథంతో రాష్ట్రంలో మరింత సాంకేతిక విజ్ఞానం విస్తరిస్తుందన్నారు.
ముఖ్యంగా గ్రామాల్లో సైతం ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి వారు మరింత శక్తిమంతులుగా మారుతారన్నారు. హెచ్పీ ఫౌండేషన్, హ్యులెట్ ప్యాకర్డ్, ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ అఫ్ ఇండియా, గైడ్ ఫౌండేషన్, స్కిల్ డెవలప్ మెంట్ సంయుక్త నిర్వహణలో రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య రథం పరుగులు తీయనుందన్నారు.
నైపుణ్య రథం....శిక్షణా కార్యక్రమాలు
ఎయిర్ కండీషన్డ్ సౌకర్యం కలిగిన ఈ రథంలో 28 కంప్యూటర్లు, వెనుక భాగంలో చిన్నపాటి స్క్రీన్ ఉంటుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ విద్యపై అవగాహన కలిగించనున్నారన్నారు. యువతకు స్కిల్ డవలప్ మెంట్ శిక్షణతో పాటు స్వయం సహాయక సంఘాలకు వ్యాపార మెళుకువలపై అవగాహన కల్పించనున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించనున్నారని తెలిపారు.
ఒక్కో గ్రామంలో ఆరు రోజుల పాటు...
ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ నైపుణ్య రథం 13 జిల్లాల్లో ఉన్న 28 స్మార్ట్ గ్రామాల్లో పరుగులు పెట్టనుందని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. కృష్ణా జిల్లాలో 4 స్మార్ట్ గ్రామాలు, మిగిలిన జిల్లాల్లో రెండు గ్రామాల చొప్పున 24 గ్రామాల్లో ఈ రథం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించనుందన్నారు. ఈ నైపుణ్య రథం ఒక్కో గ్రామంలో 6 రోజుల పాటు, రోజుకు 10 గంటల పాటు సేవలందించనుందన్నారు. ప్రతిరోజూ 4 గంటలు పాఠశాల విద్యార్థులకు, 3 గంటలు యువతకు, ఒక గంట ప్రజలకు అవసరమైన ఆధార్, మీ సేవ వంటి సేవలపైనా, మరో 2 గంటలు ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు, వాటిని పొందడం అనే విషయాలపైనా అవగాహన కల్పించనుందని సీఎం తెలిపారు.
మే నాటికి మరో 12 నైపుణ్య రథాలు...
మే నాటికి మరో 12 నైపుణ్య రథాలు రాష్ట్రానికి వచ్చేలా కృషి చేయాలని హెచ్పీ ఫౌండేషన్, హ్యులెట్ ప్యాకర్డ్, ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ అఫ్ ఇండియా, గైడ్ ఫౌండేషన్, స్కిల్ డెవలప్ మెంట్ ప్రతినిధులకు చంద్రబాబు సూచించారు. జిల్లాకొక రథం చొప్పున తిరగడం వల్ల డిజిటల్ లిటరసీ, డిజిటల్ నైపుణ్యాలు, జీవనోపాధి నైపుణ్యాలు పెంపొందించడమే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు దోహదపడుతుందన్నారు. అంతకు ముందు సీఎంకు నైపుణ్య రథం పనితీరును సంబంధిత అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, సీఎం కార్యాలయ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ చైర్మన్ సీ కుటుంబరావు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ బీ గంగయ్య, సీనియర్ ప్రోగామ్ అధికారి డాక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.