china: ట్రంప్ చర్యకు చైనా దిమ్మతిరిగే సమాధానం... అమెరికా సరుకులపై భారీ పన్ను
- అమెరికా నుంచి దిగుమతి అయ్యే 128 ఉత్పత్తులపై పన్ను
- కొన్నింటిపై 15 శాతం, కొన్నింటిపై 25 శాతం
- చైనా ఉత్పత్తులపై ట్రంప్ పన్నేయడంతో ప్రతిస్పందన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్యం విషయంలో మిత్ర దేశాలతో అనధికారికంగా మొదలుపెట్టిన యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. చైనా నుంచి దిగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపై భారీ సుంకం వేస్తూ ట్రంప్ తాజా ఆదేశాలు జారీ చేశారు. దీనికి చైనా కూడా దీటుగానే ప్రతిస్పందించేందుకు సిద్దమైంది. అమెరికా నుంచి 3 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు చైనాకు వస్తున్నాయి. వీటిలో మాంసం ఉత్పత్తులు, వైన్, సీమ్ లెస్ స్టీల్ ట్యూబులు ఇలా 128 వరకు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటిపైనా భారీ పన్నుకు చైనా ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
ఇప్పటి వరకు ఈ ఉత్పత్తులపై టారిఫ్ విషయంలో చైనా తగ్గింపు విధానాన్ని అనుసరిస్తోంది. పండ్లు, నట్స్, వైన్, తదితర ఉత్పత్తులపై 15 శాతం దిగుమతి పన్ను విధించనున్నట్టు చైనా తెలిపింది. పంది మాంసం, రీసైకిల్ చేసిన అల్యూమినియం ఉత్పత్తులపై 25 శాతం పన్ను వేయనుంది. రెండు దశల్లో ఈ చర్యలను అమలు చేయనున్నట్టు చైనా పేర్కొంది. తొలి దశలో 15 శాతం పన్నును అమలు చేస్తామని, వాణిజ్య అంశాల విషయంలో ఇరు దేశాల మధ్య అంగీకారం కుదరకపోతే రెండో దశలో 25 శాతం పన్నును ఆచరణలో పెడతామని చైనా తెలిపింది.