mumbai: మైదానంలో స్లెడ్జింగ్... డ్రైవింగ్ లో హారన్ ఇష్టముండదు: రహానే
- ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించనున్న ఎమ్ వీడీ
- ముంబైలోని వాంఖడే స్టేడియంలో రోడ్ సేఫ్టీ ఎలెవన్-నో హాంకింగ్ ఎలెవన్ జట్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్
- మ్యాచ్ లో ఆడనున్న స్టార్ క్రికెటర్లు
క్రికెట్ మైదానంలో అనవసరంగా ప్రత్యర్ధులను ఆడిపోసుకోవడం (స్లెడ్జింగ్), డ్రైవింగ్ చేసేటప్పుడు అనవసరంగా హారన్ కొట్టడం తనకు ఇష్టముండదని టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే తెలిపాడు. ముంబైలో మహారాష్ట్ర మోటార్ వెహికల్ డిపార్ట్ మెంట్ (ఎమ్ వీడీ) రహదారి భద్రత, శబ్ద కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా నేడు వాంఖడే స్టేడియంలో రోడ్ సేఫ్టీ ఎలెవన్-నో హాంకింగ్ ఎలెవన్ జట్ల మధ్య ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించనుంది.
ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్య, సురేశ్ రైనా తదితర ఆటగాళ్లు ఆడనుండడం విశేషం. ఈ సందర్భంగా రహానే మాట్లాడుతూ.. ముంబై వంటి మహానగరాల్లో శబ్ద కాలుష్యం చాలా పెద్ద సమస్య అని చెప్పాడు. అందుకే డ్రైవింగ్ చేసే సమయంలో అనవసరంగా హారన్ కొట్టడం తనకు ఇష్టముండదని అన్నాడు. రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించడం తనను ఆకట్టుకుందని రహానే తెలిపాడు.