Andhra Pradesh: ఏపీలో అనివీతిని తవ్వేందుకు పలుగు చాలదు... బుల్డోజర్ కావాలి: సోము వీర్రాజు
- ఏపీలో అవినీతికి పరాకాష్ట ‘పట్టిసీమ’
- పట్టిసీమలో ఏర్పాటు చేసింది 24 మోటార్లే
- పంపు సెట్ల ఖరీదులోనూ మతలబు ఉంది
- మీడియా సమావేశంలో సోము వీర్రాజు
ఏపీలో అవినీతి పరాకాష్టకు చేరిందని, ప్రభుత్వ అవినీతిని తవ్వడానికి పలుగు సరిపోదని, బుల్డోజర్ కావాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతికి ‘పట్టిసీమ’ పరాకాష్ట అని, రూ.1120 కోట్లతో ‘పట్టిసీమ’ మొదలైందని, ఇప్పుడు రూ.1667 కోట్లకు వెళ్లిందని అన్నారు.
పట్టిసీమలో ఏర్పాటు చేసిన మోటార్లు 30 అని చెప్పారని, కేవలం 24 మోటార్లు మాత్రమే పెట్టారని, పంపు సెట్ల ఖరీదులోనూ మతలబు ఉందని ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ కు 20 అవార్డులు వచ్చాయి కానీ, ఆయనకు సంబంధించిన శాఖలో అవినీతికి హద్దు లేదని అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిశుభ్రతకు రూ.40 లక్షలు కేటాయించడం అవసరమా? అని ప్రశ్నించిన ఆయన, ఉపాధి హామీ, సర్వశిక్ష అభియాన్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.