Chandrababu: టీడీపీకి నిజమైన స్నేహితుడు బీజేపీనే.. రాజకీయ కోణంతోనే బయటకు వచ్చారు: చంద్రబాబుకు అమిత్ షా లేఖ
- ఏపీ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో చేసింది
- తెలుగు ప్రజల కోసం ముందు నుంచి పోరాడింది బీజేపీనే
- ఎన్డీయే నుంచి టీడీపీ వెళ్లిపోవడం దురదృష్టకరం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేఖ రాశారు. కేంద్రం తరపున చేపట్టిన కార్యక్రమాలు, విభజన చట్టంలోని అంశాలు, ఏపీకి ఇచ్చిన ప్రాజెక్టుల వివరాలను లేఖలో ప్రస్తావించారు. మొత్తం తొమ్మిది పేజీల లేఖను ఆయన రాశారు. లేఖ సారాంశం ఇదే...
"శ్రీ చంద్రబాబు నాయుడు గారు,
మీకు, ఐదు కోట్ల మంది ఆంధ్రులకు ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీ అందరికీ సంతోషాన్ని, మంచి ఆరోగ్యాన్ని తీసుకొస్తుందని కోరుకుంటున్నా. ఎన్డీయే కుటుంబం నుంచి టీడీపీ వెలుపలికి వచ్చిన తర్వాత ఈ లేఖ రాస్తున్నా. టీడీపీ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యకరం, పూర్తిగా ఏకపక్షమైనది. అభివృద్ధికి సంబంధించిన కారణాలతో కాకుండా, రాజకీయపరంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నేను భయపడుతున్నా. టీడీపీ నిర్ణయం దురదృష్టకరం. అందరూ అభివృద్ధి చెందాలనేదే తమ రాజకీయ సిద్ధాంతం. ఏపీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనేది బీజేపీ అజెండాలో ఓ భాగం. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీకి ఎంతో చేసింది.
ఉమ్మడి ఏపీని విడదీయాలనే నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు... ఇరు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు మేలు జరగాలని కోరుతున్నది బీజేపీనే. కాంగ్రెస్ పార్టీ విధివిధానాలకు బీజేపీి పూర్తి వ్యతిరేకం. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ అసంబద్ధంగా చేపట్టింది. అంతేకాదు, తెలుగు ప్రజలకు మేలు చేయాలని కూడా ప్రయత్నించలేదు. అందుకే ఆ పార్టీ తెలుగు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. గతంలో లోక్ సభ, రాజ్యసభల్లో మీకు అంత మెజార్టీ లేనప్పుడు... తెలుగు ప్రజల కోసం పోరాడింది బీజేపీనే అనే విషయాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోండి. బీజేపీనే ఏపీ తరపున వాదనలు వినిపించింది.
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మీరు కూడా భాగాస్వాములుగా ఉన్నారు. రాష్ట్ర విభజనతో పూర్తిగా అన్యాయానికి గురైన ఏపీని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లడానికి ఎన్డీయే ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఏపీ కోసం కేంద్ర స్థాయిలో ఎంత చేయాలో అంతా చేసింది. ఏపీ అభివృద్ధికి మోదీ పూర్తిగా సహకరించారు. ఏపీకి సంబంధించి ఏ విషయంలోనూ వెనకడుగు వేయలేదు. టీడీపీ, ఏపీ ప్రజలకు బీజేపీనే నిజమైన స్నేహితుడు. 3 ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దాం" అని లేఖలో పేర్కొన్నారు.
దీనికి తోడు అమరావతిలో రైల్ రోడ్ నిర్మాణానికి, 180 కి.మీ. రింగ్ రోడ్డుకు నిధులను అమిత్ షా తన లేఖలో ప్రస్తావించారు. కొత్త రైల్వే నిర్మాణానికి నిధులను కేటాయించినట్టు తెలిపారు. మెట్రోరైలుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు చెప్పారు. ఏపీకి ఇచ్చిన కేంద్ర విద్యా సంస్థలు, ఎయిమ్స్ అంశాలను ప్రస్తావించారు. 2016-17లో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చిన నిధుల్లో కేవలం 12 శాతం నిధుల లెక్కలను మాత్రమే చూపారని తెలిపారు. అమరావతికి రూ. 1000 కోట్లు విడుదల చేస్తే, కేవలం 8 శాతం నిధుల లెక్కలు మాత్రమే పంపారని చెప్పారు.