jet airways: వామ్మో! తాగొచ్చిన విమాన పైలట్లు.... ఇద్దరిపై జెట్ ఎయిర్ వేస్ వేటు
- శ్వాస విశ్లేషణ పరీక్షల్లో అడ్డంగా పట్టుబడిన పైలట్, కో పైలట్
- రాజీనామా చేయాలని ఆదేశించిన సంస్థ
- వారి లైసెన్స్ లు మూడు నెలల పాటు సస్పెన్షన్
తాగి టూ వీలర్ నడిపే వారి గురించి, కారు నడిపేవారి గురించి విన్నాం... కానీ, విమాన పైలట్లు కూడా ఇందుకు అతీతం కాదని రుజువైంది. వందల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో ప్రశ్నార్థకం చేసేలా వ్యవహరిస్తూ జెట్ఎయిర్ వేస్ సంస్థకు చెందిన ఇద్దరు పైలట్లు తాగి డ్యూటీకి వచ్చారు. ఇది బయటపడడంతో వారిద్దరిపై సంస్థ వేటు వేసింది. బోయింగ్ 737 విమాన పైలట్, కో పైలట్ ను రాజీనామా చేయాలని ఆదేశించింది.
డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనలకు అనుగుణంగా ఆ ఇద్దరి లైసెన్స్ లను మూడు నెలల పాటు సప్పెండ్ చేసింది. విమానం నడిపే ముందు పైలట్లకు విధిగా శ్వాస విశ్లేషణ పరీక్ష నిర్వహిస్తారు. ఆ సందర్భంగా వారు మద్యం సేవించి వచ్చినట్టు వెలుగు చూసింది. దీనిపై జెట్ ఎయిర్ వేస్ ప్రతినిధి స్పందిస్తూ... అతిథుల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.