amit shah: అమిత్ షాకు నారా లోకేష్ కౌంటర్!
- రాజకీయ లబ్ధి కోసం ముందుకెళుతున్నది బీజేపీనే
- యూసీలకు, ప్రత్యేక హోదాకు సంబంధమేంటి?
- ఎప్పటికప్పుడు యూసీలను సమర్పిస్తున్నాం
- అమిత్ షాకు అవగాహన లేదనే విషయం అర్థమవుతోంది
- త్వరలోనే పూర్తి వివరాలతో లేఖ రాస్తాం
కేవలం రాజకీయ కారణాల నేపథ్యంలోనే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయిందని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలోని విషయాలను మంత్రి నారా లోకేష్ ఖండించారు. రాజకీయా లబ్ధితో ముందుకు వెళుతున్నది టీడీపీ కాదని, బీజేపీనే అని అన్నారు. రాజకీయ కారణాలతోనే ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు అందించడం లేదని మండిపడ్డారు.
ఏపీ ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారని చెప్పారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లకు, ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటని... యుటిలైజేషన్ సర్టిఫికెట్లకు 19 హామీలను నెరవేర్చకపోవడానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. త్వరలోనే అన్ని వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాస్తుందని చెప్పారు. ప్రభుత్వం సమర్పించిన యూసీ వివరాలన్నింటినీ లేఖలో పొందుపరుస్తామని తెలిపారు.
యూసీలు సమర్పించడంలో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉందని... ఇలాంటి పరిస్థితిలో యూసీలను ఏపీ ఇవ్వడం లేదంటూ తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని లోకేష్ అన్నారు. ఎప్పటికప్పుడు యూసీలను కేంద్రానికి అందించామని చెప్పారు. పథకాలకు సంబంధించి నిధులు అడుగుతున్నందునే... బీజేపీ ఒక పక్కా ప్రణాళిక ప్రకారం విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు. ఏపీ సమస్యలపై అమిత్ షాకు అవగాహన కూడా లేదని విమర్శించారు. ఆయన రాసిన లేఖలో ఈ విషయం స్పష్టంగా అర్థమైందని తెలిపారు.
ఎన్డీయే నుంచి బయటకు రావాలనే నిర్ణయాన్ని ఆవేశంగా తీసుకున్నామని అమిత్ షా చెబుతున్నారని... కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే బయటకు రావాల్సి వచ్చిందని లోకేష్ అన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అనేక సార్లు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.