Virat Kohli: ఐపీఎల్ ముగియగానే కౌంటీల్లో ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లనున్న కోహ్లీ
- జూలైలో ప్రారంభం కానున్న టీమిండియా, ఇంగ్లండ్ పర్యటన
- జూన్ 14న ఆఫ్ఘన్ తో జరిగే టెస్టుకి కోహ్లీ డుమ్మా
- ఇంగ్లండ్ లో సర్రే కౌంటీ జట్టు తరపున ఆడనున్న కోహ్లీ
ఐపీఎల్ టోర్నీ ముగియగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ వెళ్లనున్నాడు. జులైలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కానుండగా, 2019లో వన్డే వరల్డ్ కప్ ఇంగ్లండ్ వేదికగా జరగనుంది. దీంతో ఇంగ్లండ్ లో టీమిండియా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ ప్లేయర్లు కోహ్లీకి ఇంగ్లండ్ లోని కౌంటీల్లో ముందుగానే ఆడాలని సూచించారు. అలా ఆడడం వల్ల ఇంగ్లండ్ పిచ్ లపై అవగాహన ఏర్పడుతుందని, తద్వారా ఇంగ్లండ్ పర్యటనలోను, వరల్డ్ కప్ లోను టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయగలుగుతుందని వారు సూచించారు.
ఈ నేపథ్యంలో కోహ్లీని బీసీసీఐ ముందుగా ఇంగ్లండ్ పంపనుంది. జూన్ 14న బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ కు కోహ్లీ దూరం కానున్నాడు. ఇంగ్లండ్ లో కోహ్లీ సర్రే జట్టు తరపున కౌంటీల్లో ఆడనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీమిండియా టెస్టు క్రికెటర్ ఛటేశ్వర పుజారా కూడా ఇంగ్లండ్ కౌంటీ జట్టు యార్క్ షైర్ కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఏప్రిల్ 7న ఐపీఎల్ ప్రారంభం కానుండగా, ఈడెన్ గార్డెన్స్ లో ఏప్రిల్ 8న కోహ్లీ నాయకత్వంలోని ఆర్సీబీ, కేకేఆర్ తో తలపడనుంది.