Talasani: ఏపీ పార్టీలు అక్కడి ప్రజలను మోసం చేస్తున్నాయి: తెలంగాణ మంత్రి తలసాని
- లోక్‌సభలో బీజేపీకి 273 మంది ఎంపీల బలం ఉంది
- అవిశ్వాస తీర్మానంతో వచ్చే ప్రయోజనమేమిటి?
- 25 మంది ఎంపీలు అందరూ రాజీనామాలు చేస్తే ఫలితం రావచ్చు
- తెలంగాణ ఉద్యమం నుంచి నేర్చుకుంటే బాగుంటుంది
లోక్‌సభలో బీజేపీకి 273 మంది ఎంపీల బలం ఉందని, ఇప్పుడు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంతో వచ్చే ప్రయోజనమేమిటని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో టీడీపీ సెల్ఫ్‌గోల్ చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రిజర్వేషన్ల కోసం తమ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తున్నారని, తమను నిందించడం తగదని పేర్కొన్నారు.
పార్లమెంటులో ఆందోళన చేస్తోన్న అన్నాడీఎంకే ఎంపీలతో టీడీపీ అవిశ్వాసం మీద మాట్లాడిందా? అని తలసాని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలు అక్కడి ప్రజలను మరోసారి మోసం చేస్తున్నాయని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీలోని 25 మంది ఎంపీలు అందరూ రాజీనామాలు చేస్తే ఫలితం రావచ్చేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి నేర్చుకుని ఏపీ పార్టీలు పోరాడితే మంచిదని సలహా ఇచ్చారు.