sakshi: జగన్ నాతో చెప్పింది ఇదే!: వైయస్ భారతి
- పదేళ్లు పూర్తి చేసుకున్న సాక్షి దినపత్రిక
- పదో వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న వైయస్ భారతి
- ఉన్నత ఆశయాలతో పత్రిక స్థాపించామన్న భారతి
'సాక్షి' దినపత్రిక ప్రారంభమై పదేళ్లు పూర్తయింది. పత్రిక పదో వార్షికోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత జగన్ భార్య, సాక్షి ఛైర్ పర్సన్ భారతి రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించాలనే లక్ష్యంతోనే సాక్షి ఏర్పాటయిందని చెప్పారు. నిజాలను నిర్భయంగా రాయడంలో వెనకడుగు వేయకుండా, ముందుకు సాగుతోందని తెలిపారు. రాజకీయ దురుద్దేశాల కారణంగా ఇబ్బందులు ఎదురైన రోజుల్లో కూడా సాక్షి గట్టిగా నిలబడగలిగిందని చెప్పారు.
ఉన్నత ఆశయాలతో పత్రికను స్థాపించామని, పర్ఫెక్షన్ అనేది ఒక గమ్యం కాదు ఒక ప్రయాణమని భారతి అన్నారు. ఎప్పటికీ నంబర్ వన్ స్థానంలో ఉండటమే తమ లక్ష్యమని అన్నారు. ఎప్పటికప్పుడు కొత్తదనంతో ముందుకు సాగుదామని చెప్పారు. వాస్తవమైన వార్తల కోసం యావత్ సమాజం సాక్షినే నమ్మకానికి చిహ్నంగా చూస్తోందని తెలిపారు. ఇకపై కూడా సాక్షి ఇలాగే నిర్భయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. పదో వార్షికోత్సవం సందర్భంగా జగన్ తనతో చెప్పింది కూడా ఇదేనని భారతి తెలిపారు. ఈ సందర్భంగా సంస్థలోని ప్రతి ఉద్యోగికీ శుభాకాంక్షలు తెలిపారు.