Chandrababu: అమిత్ షా రాసిన 9 పేజీల లేఖలో అన్నీ అసత్యాలే: నిప్పులు చెరిగిన చంద్రబాబు
- కొన్ని అంశాలను వక్రీకరిస్తూ లేఖలో పేర్కొన్నారు
- ఇలా అసత్యాలు ఎందుకు చెబుతున్నారు?
- ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఇలాంటి తీరు ఎందుకు?
- రాష్ట్రానికి మంచి చేయాలనే ఆలోచన ఒక్కరోజైనా చేయలేదు
భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తనకు రాసిన 9 పేజీల లేఖలో అన్నీ అసత్యాలే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన శాసనసభలో మాట్లాడుతూ... కొన్ని అంశాలను వక్రీకరిస్తూ లేఖలో పేర్కొన్నారని అన్నారు. ఇలా అసత్యాలు ఎందుకు చెబుతున్నారని, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఇలాంటి తీరు ఎందుకని నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసిందనే విషయంపై కేంద్ర సర్కారు వద్ద, రాష్ట్ర సర్కారు వద్ద లెక్కలు ఉన్నాయని, ఇలాంటి అసత్యాలు రాస్తే తాము గుర్తిస్తామని తెలిసి కూడా ఇలా రాశారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంటే కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని చంద్రబాబు అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఏపీకి ఎందుకివ్వరని, రాష్ట్రానికి మంచి చేయాలనే ఆలోచన ఒక్కరోజైనా చేయలేదని వ్యాఖ్యానించారు.
తెలుగు వారి ఆత్మగౌరవం కోసమే ఎన్టీఆర్ పార్టీ పెట్టాలని మోదీ కూడా ఇటీవల లోక్ సభలో అన్నారని, అలాంటి పార్టీ ఇప్పుడు తెలుగు వారి ఆత్మగౌరవం కోసమే పోరాడితే తప్పేంటని చంద్రబాబు నిలదీశారు. చివరి బడ్జెట్ లోనూ రాష్ట్రానికి సాయం చేయలేదని అందుకే తాము ఇక పోరాటానికి దిగామని అన్నారు. మిత్ర పక్షంగా చేయాల్సిన ధర్మం కేంద్ర ప్రభుత్వం చేయలేదని వ్యాఖ్యానించారు.