Namo app: నరేంద్రమోదీ యాప్‌తో జర భద్రం.. సంచలన విషయాలు వెల్లడించిన ఫ్రాన్స్ నిపుణుడు
- నమో యాప్ యూజర్ల వ్యక్తిగత వివరాలు రహస్యంగా అమెరికా సంస్థ చేతికి
- వ్యక్తిగత వివరాలు, ఫొటోలు సహా చేరుతున్న సమాచారం
- ఆందోళనకరమన్న ఫ్రాన్స్ సెక్యూరిటీ నిపుణుడు ఎల్డర్సన్
ప్రధాని నరేంద్రమోదీ పేరుతో ప్రభుత్వం రూపొందించిన ‘నమో’ యాప్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫ్రాన్స్‌కు చెందిన సెక్యూరిటీ నిపుణుడు ఇలియట్ ఎల్డర్సన్ హెచ్చరించారు. ఈ యాప్ ఉపయోగించే యూజర్ల సమాచారం రహస్యంగా అమెరికాకు చెందిన ‘క్లెవర్ ట్యాప్’ అనే సంస్థకు చేరుతోందంటూ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
యూజర్ల సమాచారం ఎవరికీ తెలియకుండా క్లెవర్ ట్యాప్ డొమైన్ అయిన ‘ఇన్డాట్ డబ్ల్యూజెడ్ఆర్కేటీ డాట్ కామ్’కు వెళ్లిపోతోందని వివరించారు. నమో యాప్‌ను వినియోగిస్తున్న వారి వ్యక్తిగత వివరాలు సహా ఫొటోలు కూడా ఆ సంస్థకు చేరుతున్నాయన్నారు. క్లెవర్ ట్యాప్ ఓ అత్యాధునిక యాప్ నిర్వహణ వేదికని, యూజర్లను గుర్తించి డెవలపర్స్‌ను అభివృద్ధి చేసేందుకు మార్కెటింగ్ నిపుణులకు ఇది సాయపడుతుందని ఎల్డర్సన్ వివరించారు. యూజర్ల సమాచారాన్ని కెప్లెర్ ఎందుకు భద్ర పరుస్తుందన్నది మాత్రం ప్రశ్నార్థకమన్నారు. కాగా, క్లెవర్ ట్యాప్‌ను ‘గోడాడీ’ సంస్థ నిర్వహిస్తుండడం గమనార్హం.