Bharath Ane Nenu: 'భరత్ అనే నేను' ఆడియో రిలీజ్ వేదిక ఎందుకు మారింది?
- ఆడియో రిలీజ్ ఫంక్షన్ అమరావతికి షిప్ట్ అయినట్లు వార్తలు
- పవన్ కల్యాణ్ మేనియాకి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయమని ప్రచారం
- మహేశ్ బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సలహా మేరకే మార్పు?
సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఏప్రిల్ 7న వైజాగ్‌లో జరగాల్సి ఉంది. అయితే వేదిక కాస్తా వైజాగ్ నుంచి అమరావతికి మారిందన్న వార్తలు కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తున్నాయి. జనసేన పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనియాకు కొంతవరకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై పవన్ ఈ మధ్యకాలంలో తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అందువల్ల టీడీపీ ఎంపీ, ప్రిన్స్ మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్ కోరిక మేరకే ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం వైజాగ్ నుంచి అమరావతికి మారిందన్న వార్త వినబడుతోంది. మహేశ్‌తో శ్రీమంతుడు సినిమా తీసిన కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. బాలీవుడ్ భామ కైరా అద్వానీ కథానాయికగా నటించిన ఈ సినిమా వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.