aadhaar: ఆధార్ లీకైందంటూ జెడ్ టీ నెట్ సంచలన కథనం... కొట్టి పడేసిన యూఐడీఏఐ
- కార్డు దారుల వ్యక్తిగత వివరాలు ఎవరైనా పొందే అవకాశం
- ఓ ప్రభుత్వ సంస్థ నెట్ వర్క్ వైఫల్యం వల్లే
- జెడ్ టీ నెట్ అనే సంస్థ సంచలన కథనం
ఆధార్ డేటా భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. వ్యక్తుల సమాచారం లీకైందంటూ ఢిల్లీకి చెందిన పరిశోధనా సంస్థ జెడ్ టీ నెట్ ఓ వార్తను తన వెబ్ సైట్లో పోస్ట్ చేసింది. ఆధార్ కార్డు దారుల వ్యక్తిగత సమాచారం, ఆధార్ నంబర్, వారి బ్యాంకు ఖాతాల వంటి వివరాలను పొందేందుకు ప్రభుత్వానికి చెందిన ఓ సంస్థ నిర్వహిస్తున్న నెట్ వర్క్ పావుగా ఉపయోగపడిందని ఆ కథనంలో ఉంది.
దీంతో ఎవరైనా సరే ఆధార్ కార్డుదారుల సమాచారాన్ని డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఏర్పడినట్టు తెలిపింది. అయితే ఆ ప్రభుత్వ సంస్థ పేరును జెడ్ టీ నెట్ వెల్లడించలేదు. కాగా, ఈ కథనంలో ఎటువంటి వాస్తవం లేదని యూఐడీఏఐ ప్రకటించింది. ఆధార్ డేటా బేస్ లో ఎటువంటి ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. ఆ మధ్య కూడా ఆధార్ డేటా చోరీ జరిగిందంటూ ఓ సంస్థ సంచలనం సృష్టించే ప్రయత్నం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.