UIDAI: ఆధార్‌పై అసత్య కథనాలు రాస్తే సీరియస్ యాక్షన్ తప్పదని యూఐడీఏఐ వార్నింగ్
- ఆధార్ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ జెడ్డీ నెట్ అనే వెబ్సైటులో వచ్చిన కథనంపై సీరియస్
- సరైన ఆధారాలు లేకుండా కథనాలు రాస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
- ఆధార్ సమాచారం గోప్యంగానే ఉందని పునరుద్ఘాటన
ఆధార్ గోప్యతపై ఇటీవల కాలంలో వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వస్తున్న విమర్శలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-యూఐడీఏఐ) తీవ్రంగా స్పందించింది. ఆధార్‌కు సంబంధించి అసత్య కథనాలు, అవాస్తవాలను ప్రసారం చేసినా, ప్రచురించినా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆధార్ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతా జెడ్డీ నెట్ అనే వెబ్సైటు రాసిన కథనానికి యూఐడీఏఐ ఈ మేరకు స్పందించడం గమనార్హం.
వినియోగదారుల వ్యక్తిగత వివరాలతో పాటు వారి బ్యాంకు ఖాతాల వివరాలను కూడా సులువుగా బట్టబయలు చేసే పద్ధతులు ఉన్నాయని, అందుకు ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు సరిపోతాయంటూ జెడ్డీ నెట్ కథనం పేర్కొంది. లోపాలను సరిచేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇలాంటివి ఆగడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆధార్ గోప్యతపై సరైన ఆధారాలు లేకుండా కథనాలు ప్రచురిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని యూఐడీఏఐ హెచ్చరిక జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, ఆధార్ సమాచారం అత్యంత సురక్షితంగానూ, భద్రంగానూ ఉన్నట్లు ప్రభుత్వం మొదట్నుంచీ చెబుతున్న సంగతి తెలిసిందే.