nitin gadkari: దేశవ్యాప్తంగా 12 ఎక్స్ ప్రెస్ హైవేలను తీసుకొస్తున్నాం: గడ్కరీ
- రూ.8.5 లక్షల కోట్ల ప్రాజెక్టులపై ఒప్పందాలు కుదుర్చుకున్నాం
- 2 లక్షల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు
- ప్రతీ రోజూ 40 కిలోమీటర్ల మేర నిర్మించాలనే లక్ష్యం
దేశవ్యాప్తంగా 12 ఎక్స్ ప్రెస్ హైవే లను, 2 లక్షల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించనున్నట్టు కేంద్ర ఉపరితల రవాణా శాఖా మాత్యులు నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల సాయం కూడా తీసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ప్రతీ రోజు 28 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగినట్టు చెప్పారు.
రానున్న ఆర్థిక సంవత్సరం (2018-19)లో ప్రతీ రోజూ 40 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. రోడ్లు, పోర్టులు, షిప్పింగ్, నదీ మార్గాలకు సంబంధించి రూ.8.5 లక్షల కోట్ల ప్రాజెక్టులపై ఒప్పందాలు జరిగినట్టు చెప్పారు. కాలుష్యంపై స్పందిస్తూ ఆటోమొబైల్ కంపెనీలు విద్యుత్, ఎథనాల్, మెథనాల్ తరహా పర్యావరణ అనుకూల ఇంధనాలతో నడిచే వాహనాలను తయారు చేయాలని కోరారు.