Durgamma: అమ్మవారి కోసం కళ్లు దానం చేసిన బాలిక...!
- అమ్మవారు కలలో చెప్పిందంటూ రెండు కళ్లు పెకిలించుకున్న బాలిక
- చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు
- ఇలా చేయిడం మూర్ఖత్వమని ఆలయ ఆర్చకుడి వెల్లడి
బీహార్‌లోని దర్భాంగ జిల్లాలో ఈ రోజు ఉదయం ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, దుర్గామాత భక్తురాలైన ఓ బాలిక తన రెండు కళ్లను పెకిలించి అమ్మవారికి దానం చేసింది. దర్భాంగ జిల్లా, బహేరీ బ్లాక్ సిరువా గ్రామంలోని దుర్గామాతా ఆలయంలో చైత్ర నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన కోమల్ కుమారి ప్రతి రోజూ గుడికి వచ్చి పూజలు చేస్తోంది. ఏడో రోజైన ఈ రోజు అమ్మవారికి పూజలు జరుగుతున్న సమయంలో ఆమె తన రెండు కళ్లను బలవంతంగా పెకిలించుకుని దేవతకు అర్పించే ప్రయత్నం చేసింది.
బాలిక కళ్ల నుంచి రక్తం ధారలా కారిపోతుండటంతో అక్కడున్న వారు అప్రమత్తమై ఆమెను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దుర్గామాత తన కలలోకి వచ్చి తన శరీరంలోని ఏదో ఒక అవయవాన్ని అర్పించమని తనను కోరేదని కోమలి తన మిత్రులతో చెప్పుకునేదట. అందుకే ఆమె ఇలా చేసుంటుందని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆలయ అర్చకుడు భవ్‌నాథ్ ఝా స్పందిస్తూ...నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ఈరోజు కంటి ఆకారంలో ఉండే బెల్ పండ్ల గింజలను సమర్పిస్తామని ఆయన చెప్పారు. అయితే మూర్ఖత్వంతో కోమల్ ఇలా తన రెండు కళ్లను పెకిలించుకుందని, ఏ దేవతా ఇలా కోరదని ఆయన అన్నారు. ఈ ఘటనను హేతువాదులు, మానసిక నిపుణులు తీవ్రంగా ఖండిస్తున్నారు.