steve smith: స్టీవ్ స్మిత్ ను వెంటనే తొలగించండి: ఆస్ట్రేలియా ప్రభుత్వం
- దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో బాల్ ట్యాంపరింగ్ చేసిన ఆస్ట్రేలియా
- ఆగ్రహం వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కమిషన్
- ట్యాంపరింగ్ కు పాల్పడిన వారిపై వేటు వేయాలంటూ ఆదేశం
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ చేస్తూ ఆస్టేలియా క్రికెటర్ కేమరాన్ బాన్ క్రాఫ్ట్ అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆటలో గెలుపు కోసం ఆస్ట్రేలియా ఎంతకైనా దిగజారుతుందంటూ ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆసీస్ ప్రధాని టర్న్ బుల్ దీనిపై స్పందిస్తూ, తాను షాక్ కు గురయ్యానని చెప్పారు.
ఇదే సమయంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ తో పాటు ఇందులో భాగస్వాములైన ఆటగాళ్లపై వేటు వేయాలని ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కమిషన్ ఆదేశించింది. ట్యాంపరింగ్ గురించి ముందే తెలిసిన కోచింగ్ స్టాఫ్ ను కూడా తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏ ఆటలోనైనా మోసపూరిత చర్యలకు పాల్పడితే స్పోర్ట్స్ కమిషన్ సహించదని తెలిపింది. ఇలాంటి చర్యలతో దేశానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆస్ట్రేలియా ప్రధాని టర్న్ బుల్ మాట్లాడుతూ, బ్యాగీ గ్రీన్ క్యాప్ పెట్టుకుని దేశానికి ప్రాతినిధ్యం వహించే క్రికెటర్లను చూసి దేశం మొత్తం గర్విస్తుందని అన్నారు. రాజకీయ నేతలకంటే వీరికే ఎక్కువ విలువ ఉంటుందని... అలాంటివారు తప్పు చేయడం క్షమించరాని నేరమని చెప్పారు. ట్యాంపరింగ్ కు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియాను ఆదేశించారు.