Congress: మంత్రి అచ్నెన్నాయుడు అవాకులు చెవాకులు పేలుతున్నారు : కాంగ్రెస్ నేత గంగాధర్
- కాంగ్రెస్ పాలనలో బీసీలను అణచివేశారనడం కరెక్టు కాదు
- అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
- బీసీ ఉప ప్రణాళిక పేరిట టీడీపీ ప్రభుత్వం దగా చేస్తోంది
- టీడీపీకి బీసీలు తగిన గుణసాఠం చెబుతారు
అవాకులు చెవాకులు పేలడం మంత్రి అచ్చెన్నాయుడుకు వెన్నతో పెట్టిన విద్యే అని కాంగ్రెస్ పార్టీ నేత గంగాధర్ విమర్శించారు. ఈ మేరకు ఏపీసీసీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పాలనలో బీసీలను ఉక్కుపాదంతో అణిచివేశారని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. ఈ దేశంలో, రాష్ట్రంలో బీసీలకు సమగ్రంగా, చట్టబద్ధంగా, న్యాయంగా ఏదైనా జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే అని అన్నారు. బీసీలకు టీడీపీ ఎంతో చేసిందని అచ్చెన్నాయుడు మోసపు మాటలు చెబుతున్నారని, బీసీ ఉప ప్రణాళిక పేరుతో టీడీపీ ప్రభుత్వం దగా చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కు కాంగ్రెస్ చట్టబద్ధత కల్పించిన విధంగా బీసీ ఉప ప్రణాళికకూ చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
బీసీలకు ఫీజురీయింబర్స్‌మెంట్ కాంగ్రెస్ హయాంలోనే జరిగిన విషయాన్ని ప్రస్తావించారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా నిబంధనల పేరుతో విద్యార్థులు చదువుకునే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు.
1972లో బీసీలకు రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని, రాజీవ్‌గాంధీ హయాంలో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలలో బీసీలకు రాజ్యాంగపరమైన గుర్తింపునిచ్చింది కూడా తమ పార్టీయేనని, అది అమలు జరిగే సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ క్రెడిట్ టీడీపీకి దక్కిందని అన్నారు. 1992లో ఉద్యోగులకు ఓబీసీ రిజ్వరేషన్ కల్పించింది, 2007లో ఉన్నత విద్యాసంస్థలకు ఓబీసీ రిజ్వరేషన్ కేంద్ర స్థాయిలో కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ హయాంలో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటే , అందుకు వ్యతిరేకంగా అందరినీ రెచ్చగొట్టి అందోళనలు నిర్వహించి, అమలు జరగకుండా చేసింది చంద్రబాబునాయడేనని విమర్శించారు. వాస్తవాలను పక్కన పెట్టి తన నోటికొచ్చినట్టు అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ విషయాలను అర్థం చేసుకున్న బీసీలు టీడీపీకి తగిన సమయంలోగుణపాఠం చెబుతారని అన్నారు.