Pakistan: చరిత్ర సృష్టించిన పాక్ టీవీ చానల్.. వార్తలు చదివిన తొలి ట్రాన్స్‌జెండర్.. ఆసక్తిగా విన్న వీక్షకులు!
- పాకిస్థాన్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ న్యూస్ యాంకర్
- ట్విట్టర్‌లో వైరల్ అయిన మావియా మాలిక్ న్యూస్
- భారత్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ యాంకర్‌గా పద్మిని రికార్డు
పాకిస్థాన్‌లోని స్థానిక న్యూస్ చానల్ ‘కోహినూర్ న్యూస్’ సంచలనం సృష్టించింది. న్యూస్ యాంకర్‌గా ఓ ట్రాన్స్‌జెండర్‌ను నియమించి చరిత్రకెక్కింది. శనివారం ట్రాన్స్‌జెండర్ మహిళ మావియా మాలిక్ చదివిన న్యూస్ బులిటెన్ వైరల్ అయ్యింది. ట్విట్టర్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్.
చాలా దేశాల్లానే పాకిస్థాన్ కూడా ట్రాన్స్‌జెండర్లను మూడో జెండర్‌గా గుర్తిస్తోంది. వారికి కూడా సమాజంలో సరైన గుర్తింపు లభించేందుకు కృషి చేస్తోంది. బ్రిటన్‌లో పారిస్ లీస్ అనే ట్రాన్స్‌జెండర్ మహిళ ‘చానల్ 4 న్యూస్’ న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నారు. బీబీసీ వరల్డ్‌లో అప్సర రెడ్డి, లోటస్ టీవీలో పద్మిని ప్రకాశ్ న్యూస్ యాంకర్లుగా పనిచేస్తున్నారు. పద్మిని ప్రకాశ్ భారత తొలి ట్రాన్స్ జెండర్ న్యూస్ యాంకర్‌గా రికార్డు సృష్టించారు. తాజాగా పాకిస్థాన్‌లోనూ ట్రాన్స్‌జెండర్ మహిళ న్యూస్ రీడర్ అయ్యారు. ఎన్జీవో ‘ట్రాన్స్ యాక్షన్’ ప్రకారం పాకిస్థాన్‌లో 5 లక్షల మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.