India: గురువారం నుంచి ఐదు రోజులు బ్యాంకులు పని చేయవు... అసలు నిజమిది!
- గురువారం నుంచి సోమవారం వరకూ సెలవని ప్రచారం
- అటువంటిదేమీ లేదని స్పష్టం చేసిన ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్
- శనివారం బ్యాంకులు పనిచేస్తాయన్న అధికారులు
ఈ గురువారం నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకులు పని చేయవని, ఏవైనా అత్యవసర ఆర్థిక లావాదేవీలు ఉంటే బుధవారంలోగా చూసుకోవాలని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, ప్రజల ఆందోళనపై ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్పందించింది. ఈ వార్తలు అవాస్తవమని, వరుసగా ఐదు రోజుల సెలవులు లేవని అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య జనరల్ సెక్రటరీ థామస్ ఫ్రాంకో రాజేంద్ర దేవ్ మీడియాకు వెల్లడించారు. మహావీర్ జయంతి సందర్భంగా గురువారం ఆపై గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం బ్యాంకులకు సెలవని, శనివారం నాడు బ్యాంకులకు ఈ నెలలో ఐదో శనివారం కాబట్టి పని చేస్తాయని స్పష్టం చేశారు. ఆపై ఏప్రిల్ 1న ఆదివారం నాడు బ్యాంకులకు సెలవని చెప్పారు. రెండో తేదీన బ్యాంకులకు సెలవు విషయమై మాత్రం ఆయన స్పష్టతను ఇవ్వలేదు. అంటే గురు, శుక్రవారాలు బ్యాంకులకు సెలవు. ఆపై శనివారం బ్యాంకులు పనిచేస్తాయి. ఆదివారం ఎలాగూ బ్యాంకులు మూసే ఉంటాయి.