Jana Sena: జనసేన, సీపీఐ, సీపీఎం కలిసి బలమైన ఉద్యమం నిర్మిస్తాం : సీపీఎం మధు
- విభజన హామీల అమలు కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం
- ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశంలో తొలుత ఈ ఉద్యమం నిర్మిస్తాం
- విభజన చట్టంలోని అంశాలను నలభై ఏళ్లలో అమలు చేస్తామంటే కుదరదు : సీపీఎం మధు
ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ బలమైన ఉద్యమం నిర్మించాలని నిర్ణయించామని సీపీఎం నేత మధు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయంలో వామపక్ష నేతలతో పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధు మాట్లాడుతూ, జనసేన, సీపీఎం, సీపీఐ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన ఉద్యమం నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ముందుగా ఈ ఉద్యమం నిర్మిస్తామని, విభజన హామీల అమలు కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని సంకల్పించామని, ఉద్యమంలో అందరినీ భాగస్వాములను చేస్తామని చెప్పారు. విభజన చట్టంలోని అంశాలను నలభై ఏళ్లలో అమలు చేస్తామంటే కుదరదని, అమిత్ షా లేఖ బుకాయింపులతో కూడుకుందని విమర్శించారు. టీడీపీ-బీజేపీ లు ఏపీ ప్రయోజనాలను విస్మరించాయని నేటి యువత కొత్త రాజకీయ వ్యవస్థను కోరుకుంటోందని అన్నారు.
అనంతరం సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని, అప్పటి వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని, ఏప్రిల్ నెలలో మొదటి సమావేశం అనంతపురంలో నిర్వహిస్తామని చెప్పారు. కొత్త రాజకీయ వేదిక కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల ఎజెండాను ముందుకు తీసుకువస్తామని, ఈ నెల 27న ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా పాటిస్తామని, ఈ నెల 29న విద్యార్థి జేఏసీ ఏర్పడుతుందని చెప్పారు.