Chandrababu: చంద్రబాబు నమ్మకాన్ని నిలుపుకునేలా పని చేస్తా: వక్ఫ్ బోర్డు నూతన చైర్మన్ జలీల్ ఖాన్
- ఏపీ వక్ఫ్ బోర్డు నూతన చైర్మన్ గా జలీల్ ఖాన్ బాధ్యతల స్వీకరణ
- వక్ఫ్ బోర్డు అభివృద్ధికి రూ.100 కోట్లు అవసరం
- బోర్డు ఆస్తులను కబ్జా చేసిన వారి వివరాలను బయటపెడతా
- రాష్ట్రం కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం : జలీల్ ఖాన్
సీఎం చంద్రబాబు నమ్మకాన్ని నిలుపుకునేలా తాను పని చేస్తానని ఏపీ వక్ఫ్ బోర్డు నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. వక్ఫ్ బోర్డు అధికారులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మాట్లాడుతూ, చైర్మన్ గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఏపీ వక్ఫ్ బోర్డుకు తమిళనాడు తరహా జ్యుడిషియల్ అధికారాన్ని ఇవ్వాలని, బోర్డు అభివృద్ధికి రూ.100 కోట్లు అవసరమని, ప్రస్తుతం వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ని ఉన్నాయో బయటకు తీసుకొస్తామని చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జా చేసిన వారి వివరాలను త్వరలోనే బయటపెడతామని అన్నారు.
టీడీపీపై విపక్షాల ఆరోపణలు అవాస్తవం
ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్రం తీరుపై జలీల్ ఖాన్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని, టీడీపీపై విపక్షాల ఆరోపణలు అవాస్తవమని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా విమర్శలు గుప్పించారు. పవన్ గురించి మాట్లాడటమంటే సమయాన్ని వృధా చేసుకోవడమేనని, ‘పవన్ బేస్ లెస్ లీడర్’ అని అన్నారు.