Telugudesam: బీజేపీకి తలనొప్పి ఉండకూడదనే వైసీపీ రాజీనామా డ్రామా: టీడీపీ
- వైసీపీ రాజీనామా ప్రకటనపై టీడీపీ ముఖ్యనేతల సమావేశం
- రాజీనామాల వల్ల కేంద్రంపై ఒత్తిడి తగ్గుతుందన్న మంత్రులు
- బీజేపీ అజెండా ప్రకారమే వైసీపీ నడుచుకుంటోందని ఆరోపణ
పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు ముగిస్తే అప్పుడు తమ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైసీపీ అధినేత జగన్ ప్రకటనపై సోమవారం సాయంత్రం టీడీపీ ముఖ్యనేతలు చర్చించారు. ఎంపీల రాజీనామాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని నేతలు అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో ఉండబట్టే నెల రోజులుగా సభను స్తంభింపజేస్తూ దేశం మొత్తాన్ని ఆకర్షించగలిగామని, అదే బయటకు వస్తే ఆ అవకాశం ఉండదని పేర్కొన్నారు. రాజీనామా చేసి ఎంపీలు బయటకు వస్తే కేంద్రంపై ఒత్తిడి తగ్గి ఊపిరి పీల్చుకుంటుందని ఓ మంత్రి పేర్కొన్నారు. మిగతా నేతలు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామా నిర్ణయాన్ని మరో మంత్రి కూడా తేలిగ్గా కొట్టిపారేశారు. అదంతా ఓ డ్రామా అని, పథకం ప్రకారమే వారు రాజీనామాలు చేయనున్నట్టు చెప్పారని పేర్కొన్నారు. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే రాజీనామా చేస్తామని ప్రకటించారని విమర్శించారు. వీరు రాజీనామా చేస్తే బీజేపీకి కావాల్సినంత ఉపశమనం లభిస్తుందని అన్నారు. వారు రాజీనామా చేసి, టీడీపీ సభ్యులను కూడా రాజీనామా చేయమని డిమాండ్ చేస్తారని, ఫలితంగా సభలో ఎవరూ లేకపోతే బీజేపీకి తలనొప్పి ఉండదని వివరించారు. బీజేపీ అజెండా ప్రకారమే వైసీపీ నడుచుకుంటోంది తప్ప మరోటి కాదని మరో మంత్రి తేల్చి చెప్పారు.