Puducherry: పుదుచ్చేరి అసెంబ్లీ వద్ద మార్షల్స్-ఎమ్మెల్యేల తోపులాట.. ఉద్రిక్తత

  • బీజేపీ నామినేటెడ్ ఎమ్మెల్యేలను గుర్తించని కాంగ్రెస్ ప్రభుత్వం
  • కోర్టు ఉత్తర్వులున్నా అడ్డుకున్న మార్షల్స్
  • అసెంబ్లీ వద్ద హైడ్రామా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

పుదుచ్చేరి అసెంబ్లీ సోమవారం హైడ్రామా మధ్య ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్యేలను సభలోకి వెళ్లనీయకుండా మార్షల్స్ అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఫలితంగా అసెంబ్లీ ఆవరణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

గతేడాది జూన్‌లో పుదుచ్చేరి బీజేపీ అధ్యక్షుడు స్వామినాథన్, పార్టీ కోశాధికారి కేజీ శంకర్, సెల్వ గణపతిలను కేంద్రం పుదుచ్చేరి అసెంబ్లీకి నామినేట్ చేసింది. వీరిని సభ్యులుగా గుర్తించేందుకు అధికార కాంగ్రెస్ నిరాకరించింది. వీరి నామినేషన్‌ను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయిన బీజేపీ ఇలా దొడ్డిదారిన అసెంబ్లీలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు.

బీజేపీ నామినేటెడ్ ఎమ్మెల్యేలను అంగీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించినా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ రాత్రికి రాత్రే వారితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వీరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో వారి నియామకాన్ని కోర్టు సమర్థించింది. దీంతో వారు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చారు. వీరు అక్కడికి రాగానే సభలోకి వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకున్నారు.

కోర్టు ఉత్తర్వులు చూపించినప్పటికీ సభలోకి పంపేందుకు నిరాకరించారు. స్పీకర్ నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు లేవని, కాబట్టి లోపలికి వెళ్లనీయబోమని తేల్చి చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. అయినప్పటికీ పోలీసులు అనుమతించకపోవడంతో ఎమ్మెల్యేలు అక్కడే బైఠాయించి ముఖ్యమంత్రికి, స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News