China: ప్రేయసి కోసం ఉమన్స్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసిన యువకుడు!
- మహిళా యూనివర్సిటీలో ఏడాదికి ఒక యువకుడు చదువుకునే వెసులుబాటు
- దానిని ఆసరాగా తీసుకుని దరఖాస్తు చేసిన యువకుడు
- ఇంటర్వ్యూలో యువకుడు చెప్పిన సమాధానంతో బిత్తరపోయిన అధికారులు
ఎన్నో కలలు, లక్ష్యాలతో యూనివర్సిటీల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు విద్యార్థులు చేరుతుంటారు. కానీ చైనాలో ఒక యువకుడు మాత్రం ప్రియురాలిని వెతుక్కునేందుకు ఉమన్స్ యూనివర్శిటీలో చేరాలని భావించడం యూనివర్సిటీ అధికారులను అయోమయంలోకి నెట్టింది.
దాని వివరాల్లోకి వెళ్తే... బీజింగ్ కు చెందిన 18 ఏళ్ల యువకుడు చైనా ఉమెన్స్ యూనివర్శిటీలో అడ్మిషన్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, అది మహిళా యూనివర్శిటీ అయినప్పటికీ ప్రతి ఏటా ఒక యువకుడు ఆ యూనివర్సిటీలో చదువుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఆ యువకుడ్ని యూనివర్సిటీ అధికారులు ఇంటర్వ్యూకు ఆహ్వానించి, యూనివర్సిటీలో ఎందుకు చేరాలనుకుంటున్నావ్? అంటూ ప్రశ్నించారు.
దీనికి సదరు యువకుడు సమాధానమిస్తూ, చదువుకునేందుకు తాను యూనివర్సిటీలో చేరడం లేదని, తనకు త్వరగా గర్ల్ ఫ్రెండ్ కావాలని, అందుకే మహిళా యూనివర్సిటీలో చేరాలనుకుంటున్నానని తెలిపాడు. దీంతో అధికారులు బిత్తరపోయారు. ఈ ఇంటర్వ్యూ వివరాలను అధికారుల అనుమతితో రికార్డు చేసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ అవుతోంది.