Sriramanavami: శ్రీరామనవమి నాడు వేములవాడ రాజన్న టెంపుల్లో అపశ్రుతి...కోడెద్దులు తొక్కి చిన్నారి మృతి
- తమ పిల్లల పుట్టెంటుకలు సమర్పించడానికి రాజన్న టెంపుల్కు వచ్చిన వరంగల్ దంపతులు
- నిద్రించే సమయంలో అర్ధరాత్రి కోడెద్దులు తొక్కడంతో మూడేళ్ల కుమారుడు మృతి
- పండుగ నాడు వాటిల్లిన పుత్రశోకానికి కుమిలిపోతోన్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు
శ్రీరామనవమి పర్వదినాన సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది. కోడెద్దుల తొక్కిసలాటలో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం, వరంగల్ జిల్లా, ముల్కనూర్ గ్రామానికి చెందిన గీరబోయిన తిరుపతి-తులసి దంపతులు శ్రీరామనవమి నాడు తమ పిల్లలు మనూష్ (3), చిన్ని(2)లకు పుట్టెంటుకలు తీయడానికి ఆదివారం సాయంత్రం రాజన్న టెంపుల్కి వచ్చారు.
స్వామి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని పార్కింగ్ ప్రదేశంలో రాత్రి నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడకు వచ్చిన కోడెద్దుల గుంపు వారిని తొక్కుకుంటూ వెళ్లింది. కొన ఊపిరితో కొట్టుమిుట్టాడుతున్న మనూష్ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో అతని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు బోరున విలపించారు. మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన తమకు ఇలా జరగడంపై వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.