Telugudesam: సూపరన్నారు, ధ్యాంక్స్ చెప్పారు... ఇప్పుడీ గోలేంటి?: చంద్రబాబుకు జీవీఎల్ నరసింహారావు సూటి ప్రశ్న
- హోదా రాదని నాలుగేళ్ల క్రితమే చంద్రబాబుకు తెలుసు
- రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీని టార్గెట్ చేశారు
- నిప్పులు చెరిగిన ఎంపీ జీవీఎల్
ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని తెలుగుదేశం పార్టీకి నాలుగు సంవత్సరాల క్రితమే తెలుసునని, అప్పుడు కేంద్రం ఇస్తామని హామీ ఇచ్చిన ప్యాకేజీని తీసుకుని ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీని టార్గెట్ చేస్తున్నారని ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో రాజ్యసభకు ఎన్నికైన జీవీఎల్ నరసింహరావు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్యాకేజీ చాలా అద్భుతమని గతంలో చంద్రబాబు చెప్పారని, ప్యాకేజీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా చెప్పారని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడీ గోలేంటని ప్రశ్నించారు. ఇచ్చిన నిధులను ఎలా వెచ్చించారని ప్రశ్నిస్తే, సమాధానం ఇవ్వలేని చంద్రబాబు సర్కారు, తమను విమర్శిస్తోందని, ఈ విషయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఈ నాలుగేళ్లలో దాదాపు రూ. 2.44 లక్షల కోట్ల నిధులను రాష్ట్రానికి ఇచ్చామని స్పష్టం చేశారు.
అంతకుముందు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి కేంద్రం నుంచి మొత్తం రూ. 1.15 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. అంకెలన్నీ తమ వద్ద ఉన్నాయని, వాటి ఖర్చుకు సంబంధించిన లెక్కలు మాత్రం చంద్రబాబు వద్ద లేవని అన్నారు. ఇది కాదని చెప్పే సత్తా మీ వద్ద ఉందా? అని అడిగారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారే తప్ప తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదని అన్నారు.
రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేయలేదని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలను, హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ లను మినహాయిస్తే, మరే ఇతర రాష్ట్రానికీ ఇవ్వనంత సాయాన్ని ఏపీకి అందించామని అన్నారు. నాడు ప్యాకేజీకి అంగీకరించి, నేడు మళ్లీ హోదా గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పేరుతో తెలుగుదేశం ప్రజలను ప్రత్యేక దగా చేస్తోందని ఆరోపించారు.