Croatian soccer player die: బంతి తగలడంతో మైదానంలో కుప్పకూలిన ఆటగాడు... విషాదంలో రెండు జట్ల క్రీడాకారులు
- క్రొయేషియన్ థర్డ్ డివిజన్ ఫుట్ బాల్ లీగ్ లో కుప్పకూలిన బ్రూనో బోడన్
- బంతి ఛాతీని బలంగా తాకిన సమయంలోనే గుండెపోటు
- ఆసుపత్రికి తరలించే సరికే మృతి చెందిన బోడన్
జట్టులో అద్భుతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న క్రీడాకారుడు బంతి తగలడంతో ఫుట్ బాల్ మైదానంలో కుప్పకూలి ప్రాణాలు వదిలిన ఘటన క్రొయేషియాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. క్రొయేషియన్ థర్డ్ డివిజన్ ఫుట్ బాల్ ఆటగాడైన బ్రునో బోడన్ (25) కు మంచి ఆటగాడన్న పేరుంది. క్లబ్ స్లావోన్జియాతో మ్యాచ్ ఆడుతుండగా, ప్రత్యర్ధి జట్టు డిఫెండర్ బంతిని గోల్ పోస్టుకు దూరంగా తన్నే ప్రయత్నం చేయగా, ఆ బంతి బ్రునో బోడన్ ఛాతికి తాకింది.
దీంతో రెండడుగులు ముందుకు వేసిన బోడన్ మైదానంలో కుప్పకూలిపోయాడు. దీంతో సహచర ఆటగాడు అతనికి సపర్యలు చేసే ప్రయత్నం చేయగా, ఫలితం లేకపోవడంతో ఫిజియో సాయంతో ఆసుపత్రికి హుటాహుటీన తరలించారు. అయితే బంతి అతని ఛాతిని తాకిన సమయంలోనే అతనికి గుండెపోటు వచ్చిందని, దీంతో వెంటనే బోడన్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో మైదానంలో విషాదం నెలకొంది. బోడన్ మృతి పట్ల క్రొయేషియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం తెలిపింది.