Congress: ప్రత్యేక హోదా రావడం లేటు కావచ్చు కానీ, రావడం మాత్రం పక్కా: ఏపీసీసీ ఉపాధ్యక్షుడు
- ఏపీకి రూ.5 లక్షల కోట్లు లబ్ది చేకూర్చే విధంగా విభజన సమయంలో చేశాం
- బీజేపీ అధికారంలోకి రావడంతో ఎపీ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి
- మోదీ మోసగారితనం, చంద్రబాబు చేతకానితనం రాష్ట్రాన్ని దెబ్బతీస్తున్నాయి
ప్రత్యేక హోదా రావడం లేటు కావచ్చు కాని రావడం మాత్రం పక్కా అని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు. ఈ రోజు విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి రూ.5 లక్షల కోట్లు లబ్ది చేకూర్చే విధంగా విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిందని కానీ, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఎపీ ప్రయోజనాలు దెబ్బతిన్నాయని అన్నారు. ప్రధాని మోదీ మోసగారితనం, ఏపీ సీఎం చంద్రబాబు చేతకానితనం, వైసీపీ అధినేత జగన్ అవకాశవాదం రాష్ట్రాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా కోసం తాము మాత్రమే పని చేస్తున్నామని మభ్యపెట్టేందుకు చంద్రబాబు, జగన్ ప్రయత్నిస్తున్నారని తులసి రెడ్డి అన్నారు. టీడీపీ నిర్వహిస్తోన్న అఖిలపక్ష భేటీ దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు రావని తెలిసి జగన్ రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా రావటం తథ్యమని, అది కాంగ్రెస్ తోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. టీడీపీ, వైసీపీ, జనసేన రాష్ట్ర ప్రజలను సెంటిమెంట్ తో మోసం చేస్తున్నాయని విమర్శించారు.