election commission: ఎన్నికల సంఘం విశ్వసనీయతపై కాంగ్రెస్ సందేహాలు... తేదీలు ముందే లీకవ్వడంపై విమర్శలు
- బీజేపీ చీఫ్ కు నోటీసులు జారీ చేయాలి
- ఐటీ విభాగం చీఫ్ పై కేసు పెట్టాలి
- కాంగ్రెస్ పార్టీ డిమాండ్
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అంశం కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతపై సందేహాలకు దారితీసింది. బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 12న జరుగుతాయని, మే 18న ఫలితాలు వెలువడతాయంటూ ట్వీట్ చేశారు. వాస్తవానికి అప్పటికి ఈసీ ఇంకా షెడ్యూల్ ను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ, ఎలక్షన్ కమిషన్ పై విమర్శలకు దిగింది. 'బీజేపీ ఒక అద్భుతమైన ఎన్నికల సంఘం' అంటూ వ్యంగ్యంతో అభివర్ణించింది.
ఎన్నికల సంఘం విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షాకు నోటీసులు జారీ చేయాలని, బీజేపీ ఐటీ విభాగం చీఫ్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, దీనిపై విలేకరులు మీడియా సమావేశంలోనే ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఓమ్ ప్రకాష్ రావత్ ను నిలదీశారు. దీన్ని తీవ్ర అంశంగా పరిగణించిన ఆయన ఏదైనా తప్పు జరిగినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.