Pakistan: ఆ చిన్నారి దొరికేశాడు.. వసీం అక్రమ్ మార్గదర్శకత్వంలో రాటుదేలుతున్నాడు
- చిచ్చవట్ని ప్రాంతానికి చెందిన హసన్ అక్తర్
- స్వయంగా బౌలింగ్ లోని మెళకువలు నేర్పుతున్న వసీం అక్రమ్
- ఔట్ స్వింగ్, ఇన్ స్వింగ్ వేసేందుకు బంతి ఎలా పట్టుకోవాలో హసన్ కి తెలుసు
ఫిబ్రవరి 27వ తేదీన తన ట్విట్టర్ లో పాక్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ ఒక వీడియో పోస్టు చేస్తూ, 'ఇలాంటి టాలెంట్ దేశానికి అవసరమని.. ఈ చిన్నారి ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిస్తే చెప్పండి' అంటూ కోరాడు. దీంతో నెటిజన్లు ఆ బాలుడి కోసం గాలింపు చేపట్టారు. మొత్తానికి ఆ చిన్నారిని పాకిస్థాన్ లోని చిచ్చవట్ని ప్రాంతంలో నెటిజన్లు పట్టేసి, ఆరున్నరేళ్ల ఆ బాలుడి పేరు హాసన్ అక్తర్ అని వివరాలు చెబూతూ వసీంకి సమాచారం చేరవేశారు.
దీంతో బాలుడి కుటుంబ సభ్యులను సంప్రదించిన వసీం, తన దగ్గరికి తెప్పించుకున్నాడు. తానే నేరుగా బాలుడికి బౌలింగ్ పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. ఆ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసుకున్న వసీం అక్రమ్... ‘నేను చెబుతున్న విషయాలను హాసన్ ఎంతో ఏకాగ్రతతో వింటున్నాడు. ఆశ్చర్యకరంగా ఔట్ స్వింగ్, ఇన్ స్వింగ్ వేయడానికి బంతిని ఎలా పట్టుకోవాలో కూడా హాసన్ కు తెలుసు. హాసన్ తో ఎంతో విలువైన సమయం గడిపాను. ఇంత తక్కువ వయస్సులోనే అతని వద్ద అసాధారణ ప్రతిభ ఉంది. హాసన్ చిచ్చవట్ని ప్రాంతానికి చెందినవాడు’ అంటూ ఆనందంతో నెటిజన్లకు తెలిపాడు.