mamatha: రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాల గురించే మాట్లాడుకుంటారు: ఢిల్లీలో మమతా బెనర్జీ
- రానున్న సార్వత్రిక ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉంటాయన్న మమతా బెనర్జీ
- ఎన్డీఏకు వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు
- కీలక నేతలతో భేటీ
రానున్న సార్వత్రిక ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అన్నారు. ఎన్డీఏకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో బలమైన కూటమి ఏర్పాటు చేసేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో పలు పార్టీల నేతలతో వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ నాయకులు కలిస్తే సాధారణంగా రాజకీయాల గురించే మాట్లాడుకుంటారని, ఈ విషయంలో దాచిపెట్టాల్సింది ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు.
కాగా, ఈ రోజు ఢిల్లీలో మమతా బెనర్జీ.. ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ ఎంపీ మీసా భారతిలతో పాటు పలువురు నేతలతో చర్చించారు. మరికాసేపట్లో ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో చర్చించి ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తోనూ సమావేశం కానున్నట్లు సమాచారం. మమతా బెనర్జీ ఏర్పాటు చేయనున్న కూటమి గురించి స్పష్టత రావాల్సి ఉంది.