devid warner: దెబ్బతిన్న ఆసీస్ డ్రెస్సింగ్ రూం వాతావరణం.. వార్నర్ ను గెంటేయమంటున్న సహచరులు!
- బాల్ టాంపరింగ్ పాపం వార్నర్ దే!
- వార్నర్ మందు పార్టీ చేసుకోవడంతో మండిపడ్డ సహచరులు
- తీవ్ర విమర్శలతో వాట్స్ యాప్ గ్రూప్ నుంచి వైదొలగిన వార్నర్
బాల్ టాంపరింగ్ వ్యవహారంతో ఆస్ట్రేలియా జట్టు ఓపక్క తీవ్ర ఆందోళనలో ఉండగా, మరోపక్క వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ క్రికెటేతర స్నేహితులతో కలసి మందు కొట్టడంపై సహచరులు భగ్గుమంటున్నారు. వారి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న వార్నర్ ఆసీస్ జట్టు వాట్స్ యాప్ గ్రూప్ నుంచి వైదొలగినట్టు తెలుస్తోంది. కాగా, వార్నరే బాల్ టాంపరింగ్ వివాదానికి కారణమంటూ సీఏ విచారణ కమిటీకి ఆటగాళ్లు సూచించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫైర్ ఫాక్స్ న్యూస్ కథనం ప్రచురించింది.
అందులో వార్నరే బాల్ టాంపరింగ్ కు సూత్రధారి అని ఆటగాళ్లంతా సీఏకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో వార్నర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. స్మిత్ కు చెప్పి బాన్ క్రాఫ్ట్ తో బాల్ టాంపరింగ్ చేయించింది వార్నరేని, ఈ విషయం బాన్ క్రాఫ్ట్ సహచర పేసర్లు, మిచెల్ స్టార్క్, హాజెల్ వుడ్ తో పాటు స్పిన్నర్ లియాన్ కు కూడా తెలియదని తెలుస్తోంది. వార్నర్ వల్లే జట్టు పరువుపోయిందని పేసర్లు తీవ్రంగా ఆరోపించారట.
అంతే కాకుండా వార్నర్ పై పూర్తిగా నమ్మకం కోల్పోయామని, వార్నర్ తో కలిసి ఇక మైదానంలోకి దిగేదిలేదని కూడా సహచరులు సీఏకు స్పష్టం చేసినట్టు సమాచారం. వార్నర్ తప్పును కప్పిపుచ్చేందుకు స్మిత్ జరిగిన తప్పును జట్టు నిర్ణయంగా చెప్పినట్టు, దీంతోనే ఆటగాళ్లు భగ్గమన్నట్టు తెలుస్తోంది. దీంతో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం పూర్తిగా చెడిపోయిందని, ఆటగాళ్లు వర్గాలుగా మారారని ఆ కథనం వెల్లడించింది. విచారణలో వార్నర్ దే తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.